మన దేశ చరిత్ర రచన ఆర్య సంస్కృతితో ప్రారంభమైంది.అంటే ఆర్య సంస్కృతి కన్నా ముందు సంస్కృతి చరిత్రలో పేర్కొనబడలేదు .ఆర్య సంస్కృతిని ఆధారంగా చేసుకున్న చరిత్రలో మూలవాసులకు స్థానం లేకుండా చేయబడింది.ప్రపంచ చరిత్రలోను,మన దేశ చరిత్రలోను ప్రధాన పాత్ర వహించిన ఆర్యుల చరిత్ర విభిన్న కథనాలతో ప్రచారంలో ఉన్నందున ఏది వాస్తవమో నిర్దారించుకోలేని పరిస్థితి మూలవాసులకు కల్పించబడింది.గత చరిత్రను ఆధారం చేసుకొని నేటి చరిత్ర,నేటి చరిత్రను ఆధారంగా చేసుకొని రేపటి చరిత్ర రూపొందుతుంది అని సామాజిక శాస్త్రం తెలియజేస్తుంది.కానీ ఈనాటికి మన దేశ సమాజ జీవన చరిత్రను మూలవాసులు తెలుసుకోలేని స్థితిలోనే ఉన్నారు. .
సమాజంలో నూటికి పదిమందిలోపు ఉన్న అగ్రవర్ణాలవారు చరిత్రలో అన్ని కాలాల్లోను ప్రధాన పాత్ర వహించడం,నూటికి తొంభై మందికి పైగా ఉన్న మూలవాసులు చరిత్రలో అప్రధానులుగా ఉన్నవిధానం చరిత్రను ప్రజలు నిర్మించలేదని స్వార్థపర,దోపిడీ వర్గాలు చరిత్రను తమ ఆధిపత్యానికి అనుకూలంగా మార్చుకున్నాయని అర్ధం అవుతుంది.ఈ ధోరణి మన దేశానికీ మాత్రమే పరిమితం కాలేదు.మన దేశంలో మూడు అగ్రవర్ణాలు గతకాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఆవిర్భవిస్తున్న విధంగానే పశ్చిమ యూరప్ లోని ప్రభు వర్గం,తూర్పు యూరప్ లోని కులీన వర్గం,మధ్య ఆసియా లోని మతాధిపతులు,బానిస భూస్వామ్య పారిశ్రామిక సమాజాల్లో వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా కొనసాగుతూ ఆయా ప్రాంత చరిత్రలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.బౌద్ధ తత్త్వం ప్రకారం ఈనాటి సమాజం ఇలా ఉండటానికి కారణం రెండు ఖండాలలోనూ గత కాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఆవిర్భవిస్తున్నవారే కారణం.కానీ చరిత్ర గ్రంథాలు అలా తెలియజేయడం లేదు.ప్రపంచంలో లక్షలాది చరిత్ర గ్రంథాలు ఉన్నాయి.కానీ ఏ ఒక్క చరిత్ర గ్రంథం కూడా మనదేశంలోని ఆర్యుల,అనార్యుల చరిత్ర తొలి నాగరికత నిర్మాతల చరిత్ర తెలిజేయలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రపంచ ఆది గ్రంథాలుగా ప్రాచుర్యంలో ఉన్న ఋగ్వేదం,పాత నిభందనల బైబిల్ గ్రంథాలు ప్రపంచ ప్రజల చరిత్ర అంతా జాతుల పోరాట చరిత్ర అని తెలియజేస్తుంటే ఆధునిక విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్న చరిత్ర గ్రంథాలు ప్రపంచప్రజల చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని,ప్రపంచ చరిత్రను ఆర్ధిక కోణంలో పరిశీలించి తెలియజేస్తున్నందున మనం చదువుతున్న చరిత్రలో జాతుల పోరాట చరిత్రలు లేవు.అందువలనరెండు ఖండాలలోనూ గత కాలం నుండి ఈనాటి వరకు వంశపారంపర్యంగా ఆధిపత్యవాదులుగా ఉన్నవారి చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం.జాతుల చరిత్రలు తెలియనందున వర్గ పోరాట చరిత్రను విశ్వసిస్తున్నాం.
No comments:
Post a Comment